: అక్కడ కంచాలకు బదులు కాగితాలలో అన్నం తినాల్సిందే!
మధ్యాహ్న భోజన సమయమైందంటే చాలు, అక్కడో వింత దృశ్యం మన కంటపడుతుంది. సాధారణంగా భోజనానికి మనం కంచాలు వాడుతాం, కానీ అక్కడ నోటు పుస్తకాలలోని మధ్య పేజీని వాడుతారు. మరి కొంత మంది డెయిలీ న్యూస్ పేపర్ వాడుతారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఈ దృశ్యం సాగర్ జిల్లా పర్సౌరియా ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంటోంది. ఈ స్కూల్ లో 375 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అయితే కంచాలు లేకుండానే అక్కడ భోజనాలు వడ్డించేస్తున్నారు. పోనీ, పిల్లలు ఇంటి నుంచి కంచాలు తెచ్చుకుందామంటే స్కూలులో నీళ్ల సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు నోటు పుస్తకాల్లోని మధ్య పేజీని చించి దానిపైనే భోజనం లాగించేసి, తర్వాత ఆ పేపర్ ప్లేట్లను పారేస్తున్నారు. రెండు నెలలుగా గోధుమ పిండి సరఫరా ఆగిపోవడంతో, రొట్టెల స్థానంలో ఆ స్కూల్ లో అన్నం, పప్పు పెడుతున్నారు. దీంతో కాగితంపై అన్నం, పప్పు కలుపుకుని తినడానికి విద్యార్థులు పడే అవస్థలు వర్ణనాతీతం. దీనిపై స్కూలు హెచ్ఎంను వివరణ అడిగితే...చాలా కాలంగా ఇలాగే జరుగుతోందని, తాను హెచ్ఎం అయి కేవలం మూడు నెలలే అయిందని సమాధానమిచ్చారు. దీనిపై మధ్యాహ్న భోజన పథక ప్రాజెక్టు అధికారి ప్రద్యుమ్న చౌర్యను వివరణ అడిగితే కంచాలపై గతంలో ఫిర్యాదు అందిందని, అయితే గతంలో కంచాలు కొనేందుకు 2400 రూపాయలు మంజూరు చేశామని, ఆ నిధులు ఏమయ్యాయో విచారిస్తున్నామని అన్నారు.