: మళ్లీ పడిన స్టాక్ మార్కెట్... మరో రెండు లక్షల కోట్లు హాంఫట్!
అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు భారత ఇన్వెస్టర్ల సంపదను మరో రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు హరించివేశాయి. దీంతో గడచిన పది సెషన్ల వ్యవధిలో భారత స్టాక్ మార్కెట్ సుమారు రూ. 10 లక్షల కోట్ల పైగా నష్టపోయింది. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 562.88 పాయింట్లు పడిపోయి 2.18 శాతం నష్టంతో 25,201.90 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 167.95 పాయింట్లు పడిపోయి 2.15 శాతం నష్టంతో 7,655.05 పాయింట్లకు చేరాయి. నిఫ్టీకి ఇది 52 వారాల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. నిఫ్టీ-50లో 46 కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. బీపీసీఎల్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, లుపిన్ కంపెనీలు 0.3 శాతం నుంచి 1.47 శాతం లాభపడగా, వీఈడీఎల్ గెయిల్, టాటా పవర్, టాటా స్టీల్, హిందాల్కో తదితర కంపెనీల ఈక్విటీ 4.5 శాతం నుంచి 5 శాతం వరకూ దిగజారింది.