: అసెంబ్లీ నిరవధిక వాయిదా...వైకాపా విమర్శ!
ఓటుకు నోటు కేసులో చర్చించాలని వైకాపా పట్టుబట్టడంతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల ప్రకటించగా, ఆపై రెండున్నర గంటల తరువాత మాత్రమే సభ తిరిగి సమావేశమైంది. ఆ వెంటనే కూడా నిమిషాల్లోనే నిరవధిక వాయిదా పడటంతో, ఆఖరి రోజు ఒక్క అంశంపై కూడా చర్చ జరగకుండానే వర్షాకాల సభా సమావేశం ముగిసినట్లయింది. పది నిమిషాలు వాయిదా అని చెప్పి, రెండున్నర గంటలు ఆలస్యం చేయడంపై వైకాపా విరుచుకుపడింది. తాము టీ, కాఫీలు తాగేందుకు అసెంబ్లీకి రాలేదని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు వస్తే, అందుకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ కోడెల ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తప్పు చేసినందునే చంద్రబాబు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకు సభను వాయిదా వేయించారని వైకాపా నేతలు విమర్శించారు.