: ట్విట్టర్ సీఈవో రేసులో విజయవాడ మహిళ
పలు అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థల అత్యున్నత పదవుల్లో ఇటీవల కాలంలో తెలుగు వ్యక్తులు నియమితులవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కు కూడా ఓ తెలుగు మహిళ నియామకం అయ్యే అవకాశం ఉంది. నిన్నటివరకూ ట్విట్టర్ సీఈవోగా ఉన్న డిక్ కాస్టలో రాజీనామా చేశారు. దాంతో ఈ పదవికోసం ట్విట్టర్ పలువురి పేర్లను పరిశీలించింది. వారిలో ప్రధానంగా విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్, సీవీఎస్ ఇంట్రాక్టివ్ విభాగం అధినేత జిమ్ లాన్ జోన్ కూడా ఉన్నారు. వారిద్దరిలో ఎవరికి ట్విట్టర్ సీఈవో పదవి లభిస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే కన్సూమర్ ఇంటర్ నెట్ వ్యాపారంలో దిట్ట అయిన పద్మశ్రీ వారియర్ నే ట్విట్టర్ తీసుకోవచ్చని సమాచారం. ఆమె స్వస్థలం విజయవాడ. మాంటిసోరిస్ స్కూల్ లో పదవ తరగతి వరకు చదివిన పద్మశ్రీ... స్టెల్లా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలో స్థిరపడిన ఆమె గత 20 సంవత్సరాలుగా పలు కంపెనీల్లో కీలక పదవులు నిర్వహించారు. గతంలో ఆమె సిస్కో కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు.