: ఆస్ట్రేలియాలో కోర్టు కేసు గెలిచిన జీవీకే
ఆస్ట్రేలియా కోర్టులో విచారణ జరుగుతున్న ఓ కీలకమైన కేసులో భారత సంస్థ జీవీకేకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ దేశ బిలియనీర్ జినా రినెహార్ట్ కు చెందిన గ్రీన్ గ్రూప్ ఈ కేసులో ప్రతివాదిగా ఉండగా, ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జీవీకేకు అనుమతులు ఉన్న ఓ భారీ బొగ్గుగని వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ఆయన కోర్టును ఆశ్రయించారు. దాదాపు 3 కోట్ల టన్నుల వరకూ బొగ్గు నిల్వలున్న ఆల్ఫా గనుల్లో తవ్వకాల వల్ల నీటి వనరులకు నష్టం కగలుతుందని గ్రీన్ గ్రూప్ వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన క్వీన్స్ ల్యాండ్ అత్యున్నత న్యాయస్థానం, నీటి నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు రానీయకుండా హామీలు తీసుకుని గనులను జీవీకేకు అప్పగించాలని తీర్పిచ్చింది. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని, అన్ని నిబంధనలకు అనుగుణంగానే బొగ్గు వెలికితీత జరుగుతుందని జీవీకే ప్రతినిధి జోష్ యూలర్ వ్యాఖ్యానించారు.