: ఐఎస్ఐఎస్ లో చేరేందుకు బయలుదేరిన 11 మంది భారతీయుల అరెస్ట్
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ లో చేరేందుకు బయలుదేరిన 11 మంది భారతీయులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. వీరంతా పెద్ద ఎత్తున ఉగ్రవాదులకు ధన సహాయం చేయాలని నిర్ణయించుకున్నారని, వారికి అవసరమైన సాంకేతిక పరికరాలను సరఫరా చేసే ఉద్దేశంతో బయలుదేరారని యూఏఈ భద్రతా దళాలు వెల్లడించాయి. వీరి ప్రణాళికలను ముందే పసిగట్టిన అధికారులు గత నెలారంభంలో అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని తెలుస్తోంది. మరో ఇద్దరు కేరళకు చెందిన వ్యక్తులు ఫేస్ బుక్ ఖాతాల ద్వారా ఐఎస్ఐఎస్ కు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై వారిని దేశం నుంచి పంపివేసిన సంగతి తెలిసిందే. కాగా, భారతీయులతో పాటు ఉగ్రవాదుల్లో చేరాలన్న ఆలోచనతో ఉన్న పాకిస్థానీ, బంగ్లాదేశీయులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.