: పోలీసులపై డ్రగ్స్ ప్రయోగం, తుపాకుల కాల్పులు... బాలీవుడ్ స్టయిల్ లో తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్


ఆనంద్ పాల్ సింగ్... రాజస్థాన్ లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు దిద్వానా కోర్టులో హాజరు పరిచి తిరిగి అజ్మీర్ జైలుకు తరలిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ను తలపించే అసలు కథ అక్కడే ప్రారంభమైంది. మార్గమధ్యంలో పంజాబ్ లోని భటిందా నగరాన్ని కలిపే రహదారి వద్ద, పోలీసులపై డ్రగ్స్ ప్రయోగం జరిగింది. కోక్హార్ గ్రామం దగ్గరకు వచ్చేసరికి పోలీసులకు మత్తు ఎక్కింది. దీంతో ఆనంద్ పాల్ సహా మరో ఇద్దరు ఆయన అనుయాయులు సులువుగా తప్పించుకున్నారు. అంత మత్తులోనూ పోలీసులు గ్యాంగ్ స్టర్ బృందంపై కాల్పులు జరిపారు. చివరికి శరీరం సహకరించక, ప్రాణాలు కాపాడుకునే ఉద్దేశంతో దాక్కున్నారు. మొత్తం 11 మంది పోలీసులు ఉన్నప్పటికీ వారంతా మత్తులో పడిపోయారు. వీరిలో ఇద్దరిని అజ్మీర్ ఆసుపత్రికి, మిగిలిన 9 మందిని పర్బస్తార్ ఆసుప్రతులకు తరలించారు. ఇప్పటికీ పోలీసులకు తమపై డ్రగ్స్ ఎలా ప్రయోగించారన్న విషయం అంతుబట్టడం లేదట. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆ రాష్ట్ర హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా, ఈ ఘటన వెనుక పోలీసుల వైఫల్యం ఉందని, అత్యంత కరుడుగట్టిన నేరగాళ్లను తీసుకెళ్లే సమయంలో కనీసం రెండుకు మించిన ఎస్కార్ట్ వాహనాలు ఉండాల్సి వుండగా, ఒకే వాహనంలో వీరు వెళ్లారని ఆయన తెలిపారు. కాగా, ఆనంద్ పాల్ సింగ్ పై దోపిడీ, బెదిరిపులు, హత్య తదితర డజను కేసులకు పైగా ఉన్నాయి. గత సంవత్సరం ఓ ఏకే-47, యూఎస్ లో తయారైన కార్బైన్, ఆరు రైఫిళ్లు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు, 500 క్యాట్రిడ్జిలతో రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. ఆనంద్ ను తిరిగి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్టు కటారియా వివరించారు.

  • Loading...

More Telugu News