: కేవీపీపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు...స్పీకర్ తో పాటు సభనూ కించపరిచారని ఆరోపణ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ బంధువు కేవీపీ రామచంద్రరావుపై ఏపీ అసెంబ్లీలో అధికార టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసింది. ఈ మేరకు నేటి ఉదయం ఆ పార్టీ నేతలు స్పీకర్ కోడెల శివప్రసాద్ కు నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి తొలగించిన రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచాలంటూ కేవీపీ ఇటీవలే స్పీకర్ కు లేఖ రాశారు. ఈ లేఖలో స్పీకర్ తో పాటు సభను కించపరిచేలా కేవీపీ వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించిన కేవీపీ, నిన్న స్పీకర్ కు మరో లేఖ రాశారు. తానెవరినీ కించపరచలేదని, అసలు అలాంటి ఉద్దేశమే తనకు లేదని నిన్నటి లేఖలో కేవీపీ వివరణ ఇచ్చారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకోని టీడీపీ నేటి సమావేశాల్లో భాగంగా కేవీపీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసింది. కేవీపీపై చర్యలు తీసుకోవాల్సిందేనని నోటీసులో టీడీపీ స్పీకర్ ను కోరింది.