: వానాకాలమా? ఎండాకాలమా? హైదరాబాదులో ఠారెత్తిస్తున్న ఎండ... 88 ఏళ్ల రికార్డు బ్రేక్
సెప్టెంబరు... అంటే వర్షాకాలం. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సరాసరిలో ఉంటాయి. కానీ, ఈ సంవత్సరం అలా కాదు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వర్షాలు కురవక పోవడంతో ఎండ మండుతోంది. సప్టెంబరు నెలలో 88 సంవత్సరాల నాటి రికార్డు బద్దలైంది. 1927, సెప్టెంబర్ 15న 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత హైదరాబాదులో నమోదు కాగా, ఆపై ఎన్నడూ ఆ స్థాయి ఉష్ణోగ్రత నమోదు కాలేదు. నిన్న గురువారం నాడు దాన్ని అధిగమించి, 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత హైదరాబాదీలను ఇబ్బంది పెట్టింది. ఎండాకాలంతో పోలిస్తే, ఇది తక్కువే అయినప్పటికీ, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో ఉక్కపోసి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాగా, మరో రెండు రోజుల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడి తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపం నుంచి ఉపశమనం లభించవచ్చని వాతావరణ నిపుణులు వ్యాఖ్యానించారు.