: వ్యూహం మార్చిన వైసీపీ... ‘ఓటుకు నోటు’పై వాయిదా తీర్మానం
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటిదాకా అనుసరించిన వ్యూహాన్ని ప్రతిపక్ష వైసీపీ ఒక్కసారిగా మార్చేసింది. నేటి సమావేశంలో భాగంగా ఓటుకు నోటు కేసుపై చర్చకు అనుమతించాలని స్పీకర్ కార్యాలయానికి వాయిదా తీర్మానాన్ని అందజేసింది. ఓటుకు నోటుతో పాటు పెరిగిన ధరలపై కూడా చర్చకు అనుమతించాలని ఆ పార్టీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. పెరిగిన ధరలపై రేపటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు అనుమతిస్తామంటే, నేటి ప్రశ్నోత్తరాలకు అభ్యంతరమేమీ లేదని నిన్నటి సమావేశంలో చెప్పిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నేటితో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఉన్నపళంగా వ్యూహం మార్చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఇబ్బంది పెట్టేందుకే ఆయన ఓటుకు నోటు వ్యవహారంపై చర్చకు పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేతలు ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చినట్లు సమాచారం.