: కాశ్మీర్ లో ప్లెబిసైట్ నిర్వహించాలన్న పాక్... విరుచుకుపడ్డ భారత్
'ప్రపంచ స్పీకర్ల సదస్సు'లో పాకిస్థాన్ పై భారత్ విరుచుకుపడింది. పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ముర్తజా జావేద్ అబ్బాస్ మాట్లాడుతూ, కాశ్మీర్ ప్రజలు స్వయం నిర్ణయాధికారాన్ని వ్యక్తపరిచే సమయం ఆసన్నమైందని... అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్ము కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని... అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ విరుచుకుపడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేదికపై 2030 అభివృద్ధి లక్ష్యాల గురించి మాత్రమే మాట్లాడాలని పాకిస్థాన్ కు సూచించారు.