: ప్రపంచానికి తెలిసొచ్చిన చైనా ఆయుధ సంపత్తి ఇదే!


జపాన్ పై యుద్ధం గెలిచి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజింగ్ లో చైనా చేపట్టిన కార్యక్రమాలు, ఆ దేశ ఆయుధ సంపత్తిని ప్రపంచ ప్రజలకు తెలియజెప్పాయి. వందలాది రకాల ఆయుధాలను చైనా తొలిసారిగా బయటి ప్రపంచానికి కంటబడేలా ప్రదర్శించింది. చైనా వద్ద ఉన్న విమాన విధ్వంసక క్షిపణులు, ట్యాంకులు, యుద్ధ విమానాలు, స్టెల్త్ ఫైటర్లు, హెవీ యూఏవీలు (మానవరహిత భారీ విమానాలు), లాంగ్ రేంజ్ మిసైల్స్, కొత్తగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రాడార్ విమానాలు, ఖండాంతర క్షిపణులు, తేలికపాటి బాంబర్ విమానాలు, హెవీ మోర్టార్లు... ఇలా తన వద్ద ఉన్న ఎన్నోరకాల అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించింది. రష్యా, దక్షిణ కొరియా దేశాధినేతలతో పాటు పలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, లక్షలాది మంది చైనీయులు వీక్షిస్తుండగా, తన సైనిక పాటవాన్ని కళ్లముందుంచింది. కాగా, అమెరికాతో పోలిస్తే, చైనా రక్షణ బడ్జెట్ తక్కువే అయినప్పటికీ, పలు విభాగాల్లో అగ్రరాజ్యాన్ని మించిపోయింది. చైనాలో 23.33 లక్షల మంది సైన్యం ఉండగా, అమెరికాలో ఈ సంఖ్య 14.33 లక్షలు మాత్రమే. ఇక అమెరికా వద్ద 2,785 యుద్ధ ట్యాంకులుండగా, చైనా వద్ద 6,540 ఉన్నాయి. అమెరికాలో 2,396 యుద్ధ విమానాలు ఉండగా, చైనా వద్ద 1,667 ఉన్నాయి. సబ్ మెరైన్ల సంఖ్య అమెరికాలో 73 కాగా, చైనాలో 69. యుద్ధ విమానాలను తీసుకెళ్లగల భారీ నౌకలు అమెరికా వద్ద 10 ఉండగా, చైనా దగ్గర ఒకటి మాత్రమే ఉంది. విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థలు అమెరికా వద్ద 62 ఉండగా, చైనా వద్ద 17 ఉన్నాయి. ఖండాంతరాలకు దూసుకెళ్లే మాలిస్టిక్ మిసైల్స్ చైనా వద్ద 66 ఉండగా, అమెరికా వద్ద 450 ఉన్నాయి.

  • Loading...

More Telugu News