: "భవిష్యత్తు అంధకారంలా ఉంది"... పోలీసులకు చిక్కిన షీనా డైరీలో కీలక ఆధారాలు
షీనా బోరా హత్య కేసులో అత్యంత కీలక ఆధారాలను పోలీసులు సంపాదించారు. షీనా బోరా డైరీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసులో పోలీసులకు కొత్త సాక్ష్యం లభించినట్లయింది. ఆమె తన స్వీయ దస్తూరితో ఈ డైరీని రాసుకున్నట్టు పోలీసులు తేల్చారు. "నన్ను అన్ని వైపుల నుంచి ఒత్తిడి చుట్టుముట్టింది. ఈ జీవితమే వృథా అన్నట్టుంది. నా తల్లిని నేను ద్వేషిస్తున్నాను. ఆ దుర్మార్గపు తల్లి...., ఆమె అసలు నా అమ్మే కాదు. అదో పెద్ద దయ్యం..." ఇలా ఉన్నాయి ఆ డైరీలో షీనా తన తల్లి ఇంద్రాణి గురించి రాసుకున్న మాటలు. ఇంద్రాణి రెండవ భర్త సంజీవ్ ఖన్నాను అదుపులోకి తీసుకున్న తరువాత కోల్ కతాలో ఆయన ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఈ డైరీ దొరికినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇది సుమారు దశాబ్దం క్రితం నాటిదని, ఇంద్రాణికి, షీనాకు మధ్య ఉన్న సంబంధాలపై మరిన్ని వివరాలు అందిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 11, 2003 తేదీతో ఉన్న ఎంట్రీలో "ఓహ్... నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు! ఏమీ లేదు... నా భవిష్యత్ అంధకారంగా ఉంది" అని షీనా రాసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడీ డైరీని పూర్తిగా విశ్లేషించి, అందులోని వివరాల ప్రకారం మరోసారి ఇంద్రాణిని ప్రశ్నించాలని ముంబై పోలీసులు భావిస్తున్నారు.