: కోహ్లీ, రవిశాస్త్రిని తప్పుబట్టిన ఇషాంత్ శర్మ కోచ్
శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అద్భుతంగా రాణించాడు. మొత్తం 13 వికెట్లు పడగొట్టిన ఇషాంత్... చివరి టెస్టులోనే 8 వికెట్లు తీసి సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇదే సమయంలో, తనను తాను నిలువరించుకోలేక, శ్రీలంక ఆటగాళ్లతో వాదనకు దిగి ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. మరోవైపు శ్రీలంక ఆటగాడు చండిమల్ ఒక వన్డే నిషేధానికి గురికాగా, తిరిమన్నే, దమ్మిక ప్రసాద్ లు మ్యాచ్ ఫీజ్ లో 50 శాతం కోత విధింపునకు గురయ్యారు. ఈ క్రమంలో, కెప్టెన్ కోహ్లీ, టీం డైరెక్టర్ రవిశాస్త్రిలపై ఇషాంత్ చిన్ననాటి కోచ్ శ్రావణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. వీరిద్దరి వల్లే ఇషాంత్ శర్మ భావోద్రేకాలను నియంత్రించుకోవడంలో విఫలమయ్యాడని మండిపడ్డారు. స్లెడ్జింగ్ గురించి వీరిద్దరూ చెబుతుండటం వల్లే ఇషాంత్ కంట్రోల్ కోల్పోయాడని, చివరకు ఒక మ్యాచ్ సస్పెన్షన్ కు గురయ్యాడని అన్నారు. ముఖ్యంగా కెప్టెన్, డైరెక్టర్ లాంటి వారు అగ్రెషన్ గురించి చెబుతున్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోరాదని చెప్పారు. ఇంత జరిగిన తర్వాత కోహ్లీ, రవిశాస్త్రి బాగానే ఉన్నారని... నిషేధం ఎదుర్కొంటున్నది ఇషాంత్ శర్మ మాత్రమే అని అన్నారు. ఇది జరగడం కూడా ఒకందుకు మంచిదే అని... దీన్నించి ఇషాంత్ గుణపాఠం నేర్చుకుంటాడని చెప్పారు.