: ఆ విభాగంలో 70 శాతం పోస్టులు ఖాళీ... చేరేందుకు ఎవరూ సిద్ధంగా లేరు!


ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్... విదేశాలకు నగదును అక్రమంగా బదిలీ చేసే వారిపై దర్యాప్తు సాగించే సంస్థ. సున్నితమైన ఎన్నో కేసుల్లో పలు చిక్కుముడులు విప్పింది. ఈ విభాగంలో 70 శాతం అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈడీలో చేరేందుకు ఎవరూ సుముఖంగా లేరు. ఏజన్సీలో ప్రోత్సాహక స్కీములు అమలు కాకపోవడంతోనే ఈ పరిస్థితి వస్తోందని ఉన్నతాధికారులు అంటున్నారు. "ఆపరేషనల్ స్థాయి పోస్టుల్లో ఉద్యోగులను నియమించడం కష్టసాధ్యంగా ఉంది. డిప్యుటేషన్ పై ఈడీలో చేరేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. సీబీఐలో కేసులు పరిష్కారమైన తరువాత అధికారులకు లభించే ఇన్సెంటివ్ స్కీములు, రివార్డుల విధానాన్ని ఈడీలో కూడా ప్రవేశపెట్టాలి" అని ఇటీవల ఈడీ డైరెక్టర్ కేంద్ర రెవెన్యూ విభాగానికి లేఖ రాశారు. మొత్తం 1,593 పోస్టులు ఈడీ విభాగంలో ఉండగా, కేవలం 450 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయని అధికారులు వివరించారు. రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్), ఐబీ (ఇంటెలిజన్స్ బ్యూరో) వంటి విభాగాల్లో మాదిరిగా ఇక్కడ కూడా ప్రోత్సాహకాలు ఉంటే మరింత మంది విధుల్లో చేరవచ్చని అధికారులు సూచిస్తున్నారు. గత ఏడేళ్లలో 14 మార్లు ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం రాలేదని వాపోతున్నారు. కాగా, కామన్ వెల్త్ కుంభకోణం, 2జి స్కామ్, కోల్ గేట్, వైఎస్ జగన్ మనీ లాండరింగ్, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా కేసు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓపీ చౌతాలా కేసు, అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ కుంభకోణం, ఇస్రో ఎస్-బ్యాండ్ తరంగాల డీల్ వంటి ఎన్నో కేసులు ఈడీ పరిధిలో విచారణ దశలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News