: మరో యాత్రకు సిద్ధమైన ఏపీ సీఎం... 9 నుంచి ‘రైతు కోసం చంద్రన్న యాత్ర’
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరో భారీ యాత్రకు సిద్ధమయ్యారు. గత ఎన్నికలకు ముందు సుదీర్ఘ యాత్ర చేసిన చంద్రబాబు రికార్డు సృష్టించారు. కష్టానికి తగ్గ ఫలితం దక్కిన నేపథ్యంలో ఏపీకి మరో దఫా ఆయన సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. తాజాగా రాష్ట్రంలోని రైతన్నల సంక్షేమం కోసం పాదయాత్ర చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నిన్న ఆయన తన కేబినెట్ సహచరులతో సమీక్షించారు. ‘రైతు కోసం చంద్రన్న యాత్ర’ పేరిట ఈ నెల 9 నుంచి 24 దాకా చేపట్టనున్న యాత్రను చంద్రబాబు 15 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగిస్తారు. సాగును లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రైతుల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా చేపట్టనున్న ఈ యాత్రలో చంద్రబాబు నేరుగా రైతులతో మాట్లాడతారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారంతో పాటు సాగుపై రైతుల సలహాలు, సూచనలను కూడా చంద్రబాబు స్వీకరిస్తారు. యాత్రలో భాగంగా బహిరంగ సభలు, వర్క్ షాపులు, ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా యాత్రకు పక్కాగా రూపకల్పన చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.