: 'నిర్బంధ తమిళం'తో తెలుగుకు దూరమవుతున్నామంటూ తమిళనాడు అసెంబ్లీలో తెలుగు ఎమ్మెల్యే ఆవేదన


తమిళనాడులో 2006లో డీఎంకే ప్రభుత్వం 'నిర్బంధ తమిళం' పేరుతో జారీ చేసిన జీవోపై తెలుగు ఎమ్మెల్యే కె.గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ, తమ పిల్లలను మాతృభాషలో చదువుకోనివ్వాలని కోరారు. అయితే తాము తమిళానికి వ్యతిరేకం కాదని చెప్పారు. తమ మాతృభాషను కూడా చదువుకుంటామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సభలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అంతేగాక తమిళనాట మైనారిటీ భాషలైన తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ బతికే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ జీవోతో తమిళనాడులోని వందలమంది తెలుగు విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునే అవకాశం కోల్పోతున్నారని పేర్కొన్నారు. జీవో సాకుతో ఒక్కో ఏడాది ఒక్కో తరగతిలో తెలుగు సబ్జెక్టును తీసేస్తున్నారని, తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా పెట్టడం వల్ల మార్కులు ఉండవన్న ఉద్దేశంతో తెలుగు విద్యార్థులు మాతృభాషను వదిలేస్తున్నారని తెలిపారు. 2012లో సీఎం జయలలిత శాసనసభ సాక్షిగా తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగనివ్వబోమని తెలుగులోనే హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పుకొచ్చారు. ఇక్కడ విశేషమేంటంటే... తెలుగు విద్యార్థులకు మద్దతుగా మాట్లాడాలంటూ సభలో ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే వినతిపత్రాలు ఇచ్చారు. కానీ ఆయన మాట్లాడుతున్న సమయంలో మద్దతుగా ఒక్కరు కూడా మాట్లాడకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే, తమిళనాడులోని తెలుగువారి సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 10న హైదరాబాద్ లో తమిళనాడు తెలుగు సంఘాలు మహాధర్నాను నిర్వహించనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ లో నిన్న(మంగళవారం) ధర్నా వాల్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. ఇందిరాపార్కులో ఆ ధర్నా జరగనుంది.

  • Loading...

More Telugu News