: సెయింట్ జోసెఫ్ స్కూల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ... టెన్త్ విద్యార్థి మృతి
చిన్న వయసులోని విద్యార్థుల మధ్య పెద్ద స్థాయి ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కారణాలేమైనా ఈ ఘర్షణల్లో బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్థులు పట్టుమని 20 ఏళ్లు కూడా నిండకుండానే మృత్యువాత పడుతున్నారు. ఈ ఘటనలు బాధితుల తల్లిదండ్రులను తీవ్ర విషాదంలోకి నెడుతుండగా, ఆయా విద్యాలయాల యాజమాన్యాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ తరహా ఘటనే నేటి ఉదయం హైదరాబాదు కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్స్ స్కూల్ లో చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు స్కూల్ ఆవరణలోనే కలబడ్డారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు విసురుకున్నారు. ఈ ఘర్షణలో సిద్దిఖ్ అనే టెన్త్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం దీనిపై గోప్యతను పాటిస్తూనే గాయాలైన విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. అయితే చికిత్స పొందుతూ సిద్దిఖ్ నేటి ఉదయం చనిపోయాడు. దీంతో విషయం పోలీసుల వద్దకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిసేపటి క్రితం పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఇక విద్యార్థులు కలబడ్డ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘర్షణకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.