: రాజ్ నాథ్ సింగ్ పక్కలో మోదీ బల్లెం!
ఎన్నో కేంద్ర మంత్రి పదవుల కన్నా ఆ పోస్టుకు విలువ ఎక్కువ. అదే కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఉద్యోగం. అటువంటి పోస్టులో తనకు నమ్మకమైన వ్యక్తిని నిలపాలని ఆ శాఖ అధిపతి భావించడం సహజమే. అయితే, హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అసంతృప్తిని కలిగించేలా, ఆయనకు తెలియకుండానే కార్యదర్శి నియామకం జరిగిపోయింది. మోదీ స్వయంగా రాజీవ్ మెహ్రిషీని ఎంపిక చేసి అత్యంత కీలకమైన హోం శాఖ కార్యదర్శి పదవిని అప్పగించి రాజ్ నాథ్ సింగ్ పక్కలో బల్లాన్ని ఉంచారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పదవీ విరమణకు ఒక్క రోజు ముందు రాజీవ్ ను ఈ పదవి వరించింది. వాస్తవానికి తన కార్యదర్శి ఎల్.సీ గోయల్ ను మార్చాలని రాజ్ నాథ్ భావించారు. ఇదే విషయాన్ని మోదీ దృష్టికి తీసుకువెళ్తే, ఆయన సైతం సరేనని, ఆ వెంటనే, తనకు నమ్మకమైన వ్యక్తిని తెచ్చి బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్ లో వసుంధరా రాజే ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజీవ్, సంస్కరణల అమలులో ముందు నిలిచి మోదీ కోటరీలోకి చేరిపోయారు. 1978 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆయనను, గత సంవత్సరం అక్టోబరులో ఆర్థిక వ్యవహారాల విభాగానికి తీసుకువచ్చిన మోదీ, అరుణ్ జైట్లీకి కుడి భుజంగా నిలిపారు. ఆ శాఖలో సైతం రాజీవ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయి. ఇప్పుడిక హోం శాఖలోకి, అందునా రాజ్ నాథ్ కు ఇష్టం లేకుండానే రాజీవ్ ప్రవేశించడం, మంత్రిత్వ శాఖలో అస్థిరతకు దారితీయవచ్చని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, పాత కార్యదర్శి గోయల్, రాజ్ నాథ్ మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే ఆయన్ను తొలగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితుడైన అదనపు కార్యదర్శి ఏకే సింగ్ ను పక్కన బెడుతూ, గోయల్ తీసుకున్న నిర్ణయాలు రాజ్ నాథ్ కు నచ్చకనే, గోయల్ స్థానంలో మరొకరిని నియమించాలని ఆయన కోరినట్టు సమాచారం.