: వైఎస్ ఫొటో చూస్తే టీడీపీ నేతల పంచెలు తడిసిపోతున్నట్టున్నాయి: రోజా ఘాటు వ్యాఖ్య
వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి ఆర్కే రోజా మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభ ఆవరణలో వైఎస్ చిత్రపటాన్ని తొలగించిన విషయంపై వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వైఎస్ చిత్రపటాలున్న ప్లకార్డులను పట్టుకుని స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంతరం విపక్ష నేతల నినాదాలతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద యనమల వ్యాఖ్యలపై స్పందించిన రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వైఎస్ ఫొటో చూస్తే టీడీపీ నేతల పంచెలు తడిసిపోతున్నట్టున్నాయి. అందుకే ఆయన ఫొటో తీసేశారు. అసెంబ్లీ ఆవరణలో దివంగత నందమూరి తారకరామారావు ఫొటోను పెట్టడం ఇష్టం లేకనే వైఎస్ ఫొటోను తీసేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.