: నేనే చంపాను... ఎట్టకేలకు నేరం అంగీకరించిన ఇంద్రాణి!
తన కడుపున పుట్టిన బిడ్డ షీనా బోరాను హత్యచేసింది తానేనని ఇంద్రాణి అంగీకరించింది. పోలీసుల విచారణలో దాదాపు వారం రోజుల పాటు మౌనం పాటించిన ఆమె, ఎట్టకేలకు నోరు విప్పి తప్పు ఒప్పుకుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిన్న ఆమెను కోర్టులో హాజరు పరిచిన సమయంలో రెండో కుమార్తె విధితో కాసేపు మాట్లాడిన ఇంద్రాణి, ఆపై పోలీసుల వద్ద అసలు విషయం చెప్పినట్టు తెలుస్తోంది. మిగతా నిందితులు పోలీసుల విచారణలో నేరం అంగీకరించారని విధి చెప్పడంతో, అప్పటివరకూ షీనా బతికేవుందని, అమెరికాలో చదువుతోందని, తానంటే కోపంతోనే బయటకు రావడం లేదని పలు కథలు చెబుతూ వచ్చిన ఇంద్రాణి, నోరు విప్పింది. హత్య వెనుక ఏ ఆర్థిక కారణాలు లేవని, ఎవరూ ప్రేరేపించలేదని చెప్పిన ఆమె, మిఖాయిల్ ను హత్య చేయాలన్న ఉద్దేశం తనకేనాడూ లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. "మొత్తం నేరంలో ఇప్పటికీ పూర్తి స్పష్టత రాలేదు. మాకు కొన్ని అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తాం" అని ఓ పోలీసు అధికారి వివరించారు. ఇదిలావుండగా, రాయగఢ్ లో షీనా బోరా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతం నుంచి సేకరించిన నమూనాలు షీనావేనని గుర్తించేందుకు, ఆమె తండ్రిగా ప్రపంచానికి పరిచయమైన సిద్ధార్థ దాస్ ను ముంబై రప్పించి డీఎన్ఏ పరీక్షలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.