: ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉదారం... ‘ప్రయాస్’ను ప్రారంభించిన మెగాస్టార్ కోడలు
వారంతా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే. క్షణం తీరిక లేకుండా కష్టపడితేనే అనుకున్న మేర లక్ష్యాలను సాధిస్తారు. తమ కంపెనీలను బిజినెస్ వరల్డ్ లో అగ్రస్థానానికి చేరుస్తారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు. అయితే తమకు అన్నీ ఇచ్చిన సమాజానికి తామేం ఇస్తున్నామన్న ఆలోచన కొందరిలో వచ్చింది. అంతే, కొంతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. సమాజానికి తాము బాసటగా నిలవాలని తీర్మానించుకున్నారు. ‘ప్రయాస్’ పేరిట ఓ సంస్థను నెలకొల్పుకున్నారు. దీంతో, నిన్న హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఈ సంస్థ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రస్తుతానికి విద్యానగర్ లోని దుర్గాభాయి దేశ్ ముఖ్ ఒకేషనల్ ట్రైనింగ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ హ్యండీక్యాప్డ్ తో పాటు మలక్ పేటలోని జీహెచ్ఎస్ బ్లైండ్ గర్ల్స్ స్కూల్ కు విరాళాలు సేకరించేందుకు ఈ సంస్థ రంగంలోకి దిగింది. ఇందుకోసం ఈ నెల 5న సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ఓ గజల్ కాన్సర్ట్ ను నిర్వహిస్తోంది.