: రాజకీయాల్లో డబ్బు ప్రవాహానికి చంద్రబాబే ఆద్యుడు!: తెలంగాణ మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ మంత్రి, టీడీపీ మాజీ నేత తలసాని శ్రీనివాసయాదవ్ మరోమారు ఘాటు విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి డబ్బు ప్రవాహాన్ని తెచ్చింది చంద్రబాబేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిలతో కలిసి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబుపై తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డబ్బు వ్యవహారాల గురించి తనకే బాగా తెలుసునని కూడా తలసాని చెప్పుకొచ్చారు. తాను నిప్పునంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. హైదరాబాదు నగరాన్ని తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఏపీకి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు.