: ప్రత్యేకహోదా ఎందుకు అడుగుతున్నానో తెలుసా?: జగన్
శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం టీడీపీ, వైఎస్సార్సీపీ సిగపట్లు పడుతున్నాయి. ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీ మేలైనది అని టీడీపీ నేతలు వాదిస్తుండగా, ప్రత్యేకహోదా వేరు, ప్యాకేజీ వేరు అని జగన్ వాదిస్తున్నారు. హోదా లభిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటులు వస్తాయని జగన్ తెలిపారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు ఆదాయ, కస్టమ్స్ సుంకాల నుంచి వంద శాతం మినహాయింపు ఉంది. ఈ లాభాలను 11 రాష్ట్రాలు పొందుతున్నాయని, ఏపీలో ఇలాంటి రాయితీని ఎందుకు వద్దంటున్నారో తెలియడం లేదని జగన్ పేర్కొన్నారు. ఏఐబీపీ నిధుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 90 శాతం గ్రాంటుగా వస్తుందని, అదే హోదా లేకుంటే 70 శాతం వస్తుందని జగన్ తెలిపారు. 20 శాతం నిధులు ఎందుకు ప్రభుత్వం వద్దనుకుంటోందో అర్థం కావడం లేదని జగన్ పేర్కొన్నారు. ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రానికి ఎంత శాతం నిధులు ఇవ్వాలనే దానికి నిబంధనలు లేవని, ప్రధానికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వవచ్చని, జమ్మూకాశ్మీర్ కు 70 వేల కోట్ల రూపాయలు అలా కేటాయించినవేనని ఆయన వెల్లడించారు. కోటీ యాభై లక్షల మంది జనాభా కలిగిన జమ్మూ కాశ్మీర్ కు అంత మొత్తం కేటాయిస్తే, 5 కోట్ల జనాభా కలిగిన ఏపీకి ఎంత నిధులు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా వల్ల వచ్చే సౌకర్యాల వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి పోటెత్తుతాయని, వేల కోట్ల పెట్టుబడులతో ఉద్యోగావకాశాలు వస్తాయని ఆయన చెప్పారు.