: హమ్మయ్య... మాథ్యూస్, పెరీరా ఔట్... మూడు వికెట్ల దూరంలో టీమిండియా!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది. సెంచరీ హీరో మాథ్యూస్, అర్ధసెంచరీతో రాణించిన పెరీరాను 77వ ఓవర్ తొలి బంతికి అశ్విన్ బోల్తా కొట్టించాడు. దీంతో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన పెరీరా 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అనంతరం 81వ ఓవర్ మూడవ బంతికి మాథ్యూస్ (110) ను ఇషాంత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా బలిగొన్నాడు దీంతో శ్రీలంక 249 పరుగుల వద్ద ఏడవ వికెట్ కోల్పోయింది. దీంతో విజయానికి టీమిండియా మరో మూడు వికెట్ల దూరంలో నిలిచింది. ప్రస్తుతానికి క్రీజులో హెరాత్ (11), కుశాల్ (1) వున్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ 3, ఉమేష్ యాదవ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు.