: మరింతగా దిగజారిన భారత పారిశ్రామికోత్పత్తి, పాతాళంలోకి స్టాక్ మార్కెట్


గడచిన జూలై నెలలో భారత పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మరింతగా కుంచించుకుపోయాయి. జూన్ లో 3 శాతంగా ఉన్న ఐఐపీ, జూలై వచ్చేసరికి 1.1 శాతంతో సరిపెట్టుకుంది. బొగ్గు, క్రూడాయిల్, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాల్లో వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. బొగ్గు ఉత్పత్తి తగ్గడం, నిర్మాణ రంగం నిదానంగా సాగుతుండటంతో ఉక్కు పరిశ్రమలపై పడ్డ ప్రభావం తదితరాలు పారిశ్రామికోత్పత్తిని పెరగనీయకుండా చేశాయి. మొత్తం ఐఐపీలో 38 శాతం వెయిటేజీ ఉన్న ఈ ఎనిమిది రంగాల్లో పనితీరు అసంతృప్తికరంగా ఉండటంతో, 2014-15 తొలి త్రైమాసికంలో 5.5 శాతంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూలై కాలానికి 2.1 శాతానికి దిగజారాయి. గత సంవత్సరంతో పోలిస్తే 6 శాతంగా ఉన్న బొగ్గు ఉత్పత్తి వృద్ధి 0.3 శాతానికి, ఉక్కు ఉత్పత్తిలో పెరుగుల 4.9 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గాయి. మంగళవారం నాడు కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ఘోరంగా దెబ్బతీశాయి. దీంతో ఆదిలోనే నష్టాల్లోకి జారిన సెన్సెక్స్ కోలుకోలేకపోగా మరింతగా దిగజారింది. మధ్యాహ్నం 2:25 గంటల సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 615 పాయింట్లు నష్టపోయి క్రితం ముగింపుతో పోలిస్తే 2.34 శాతం దిగజారి 25,667 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరో వైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచి 213 పాయింట్లు దిగజారి 2.68 శాతం నష్టంతో 7,758 పాయింట్లకు చేరింది. నిఫ్టీ-50లో బజాజ్ ఆటో, ఎన్టీపీసీ మినహా మిగతా అన్ని కంపెనీలూ నష్టపోయాయి. అత్యంత కీలకమైన 7,800 పాయింట్ల స్థాయి వద్ద నిఫ్టీకి మద్దతు లభించక పోవడంతో మరింత పతనం దిశగా సూచీలు సాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News