: కార్లు కొనేస్తున్నారు... పెరిగిన మారుతి సుజుకి విక్రయాలు
మార్కెట్ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, దేశంలో కొత్త వాహనాల కొనుగోళ్లు గడచిన ఆగస్టు నెలలో సంతృప్తికరంగా సాగాయి. ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న మారుతి సుజుకి అమ్మకాలు 6.4 శాతం పెరిగాయి. ఆగస్టు 2014తో పోలిస్తే సంస్థ విక్రయాలు 1,10,776 యూనిట్ల నుంచి 1,17,864 యూనిట్లకు పెరిగాయని సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. ఇండియాలో అమ్మకాలు 8.6 శాతం వృద్ధితో 98,304 యూనిట్ల నుంచి 1,06,781 యూనిట్లకు చేరాయని తెలియజేసింది. మినీ కార్ల సెగ్మెంట్ లో ఆల్టో, వాగన్ ఆర్ విక్రయాలు 34,686 యూనిట్ల నుంచి 37,665 యూనిట్లకు పెరిగాయని, స్విఫ్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్ ల విక్రయాలు 11.3 శాతం పెరిగాయని తెలిపింది. వాహన రంగంలోని మిగతా కార్లు, ద్విచక్ర వాహన కంపెనీల ఆగస్టు గణాంకాల వివరాలు వెలువడాల్సి వుంది.