: అంతా బాగానే ఉంది, ఏపీకి హోదా కోసం ఏం చేస్తామన్నది తప్ప!: జగన్ ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తామన్న విషయం ఒక్క ముక్కులో కూడా చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ మొత్తాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విపక్ష నేత వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగంలో గణాంకాలు తప్ప, హోదా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న చర్చలో పాల్గొన్న జగన్ ప్రసంగిస్తూ, ప్రత్యేక హోదాపై సీఎంకు అణుమాత్రమైనా అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదని విమర్శించారు. ఏపీకి తక్షణం హోదా కల్పించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పకుండా, ఏదో బ్రహ్మపదార్థాన్ని తీసుకువస్తున్నట్టు మాట్లాడుతున్నారని, ఇది రాష్ట్ర ప్రజలందరి ఖర్మని అన్నారు. ఏదైనా రాదని తెలిస్తే, అది వృథాగా ప్రచారం చేయడం బాబుకు అలవాటేనని విమర్శించారు. ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజీ తెస్తామని అనడం సరికాదని, హోదానే ఇవ్వనివారు, అంతకు మించిన ప్యాకేజీని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దాన్నెలా నమ్ముతారని చంద్రబాబును అడిగారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. చంద్రబాబుకు తెలియని ఎన్నో విషయాలపై తమకు అవగాహన ఉందని జగన్ అన్నారు. తమ పార్టీ హోం వర్క్ చేసి అసెంబ్లీకి వస్తుందని తెలిపారు.