: నేనెక్కడా రాజీపడను... సీఎం కావాలని పగటికలలు కనొద్దు: జగన్ కు బాబు చురక
ప్రభుత్వంపై, తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను శాసనసభలో సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆనాడు కాంగ్రెస్ పై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ఇచ్చి ఎందుకు ఉపసంహరించుకున్నారు? అని మరోసారి ఈరోజు సభలో ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో తాను కేంద్రంతో రాజీపడ్డానంటూ వైసీపీ అనడాన్ని ఆయన ఖండించారు. తానెక్కడా రాజీపడనని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ప్రలోభాలు, బలహీనతలు లేవన్నారు. ఇక రెండేళ్లలో తాను ముఖ్యమంత్రి అవుతానని, ఈ విషయాన్ని తనకు జ్యోతిష్యులు చెప్పారంటున్నారని జగన్ ను ఉద్దేశించి అంటూ, సీఎం కావాలని పగటికలలు కనొద్దని జగన్ పై పరోక్షంగా చురక వేశారు. ఇక కేంద్రం నుంచి మీ మంత్రులు ఎప్పుడు తప్పుకుంటారని ఈ మధ్య తెగ అడుగుతున్నారన్న చంద్రబాబు, రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరమనే పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. కేంద్రం సహకరిస్తే తప్ప విభజన ఇబ్బందులను ఎదుర్కోలేమని పేర్కొన్నారు. కేంద్రంతో సన్నిహితంగా ఉండేది తన స్వార్థం కోసం కాదని, కేవలం రాష్ట్రం కోసమేనని తేల్చి చెప్పారు. వాళ్లలా తనపై ఎలాంటి కేసులు లేవని, మంచి కార్యానికి అడ్డుపడటం తప్ప వైసీపీ ఏదైనా మంచిపని చేసిందా? అని బాబు నిలదీశారు. ప్రజలకు సేవకుడు, రక్షకుడిగా ఉంటానని, రాజీపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు.