: నా వైపు ధర్మం ఉంది కాబట్టి ఎవరికీ భయపడను!: సీఎం చంద్రబాబు
విభజన చట్టంలోని పలు సెక్షన్లలో ఒకదానితో ఒకటికి పొంతన లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సెక్షన్ 9 ఇంకా పరిష్కారం కాలేదని, సెక్షన్ 10లో ఇంకా సమస్యలున్నాయని చెప్పారు. సమస్యలు పరిష్కరించుకుందామని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని శాసనసభలో ప్రకటన సందర్భంగా తెలిపారు. తెలంగాణ, ఏపీ సయోధ్యగా ముందుకు వెళ్లాలని, మన మధ్య సమస్యలు పరిష్కారం కాకపోతే కేంద్రం వద్దకు వెళదామని కూడా తెలంగాణకు చెప్పానన్నారు. తన వైపు ధర్మం ఉంది కాబట్టి ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేందుకు ఎప్పుడూ ముందుంటామన్నారు. కేవలం ప్రత్యేక హోదా కాదని.. అన్ని హక్కుల కోసం పోరాడాలని కోరారు. గతంలో ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఇటీవల ప్రధానిని కలసి లేఖ ఇచ్చానన్న సీఎం, అందులో మొట్టమొదట కోరింది ప్రత్యేక హోదాపైనే అని వెల్లడించారు. ప్రధానిని ఇటీవల కలసినప్పుడు ఆయనకు అన్ని విషయాలు వివరించానన్నారు. ఇక రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద కేంద్రం ఇంతవరకు 2వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ వంటి రాజధానిని నిర్మించుకోవాలంటే సుమారు 20 ఏళ్లు పడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకు రూ.5 లక్షల కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.1500 కోట్లు సరిపోవని, అదే విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పానన్నారు. నూతన రాజధానికి ప్రత్యేక నిధిని కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు.