: దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఢిల్లీ కోర్టు జరిమానా
దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఢిల్లీ హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది. 1975లో హిందీలో ఘనవిజయం సాధించిన 'షోలే' చిత్రాన్ని 'ఆగ్' పేరుతో 2007లో వర్మ రీమేక్ చేశాడు. అయితే ఒరిజినల్ సినిమాలో సన్నివేశాలు, పాత్రలు, నేపథ్య సంగీతాన్ని కాపీ చేశారంటూ నాటి 'షోలే' నిర్మాతల మనవడు సచ్చాసిప్పీ కాపీరైట్ చట్టం కింద వర్మపై గతంలో కేసు పెట్టాడు. దానిపై తాజాగా ఢిల్లీ న్యాయస్థానం పైవిధంగా తీర్పు వెల్లడించింది. ఈ కేసులో వర్మతో పాటు ఆగ్ సినిమా నిర్మాతలు ఆర్ జీవి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, వర్మ కార్పొరేషన్ లిమిటెడ్, మధు వర్మ దోషులుగా ఉన్నారు. వర్మ రూపొందించిన ఆగ్ 2007 ఆగస్టు 31న విడుదలవగా ఈ సంవత్సరం అదే నెల అదే తేదీన తీర్పు రావడం గమనార్హం.