: తెలుగోళ్లను 25 కంపెనీలు రూ. 30 వేల కోట్లకు ముంచేశాయి: ఏపీ ఉప ముఖ్యమంత్రి
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను 25 కంపెనీలు రూ. 30 వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేశాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. ఈ కంపెనీలపై, వాటిని నిర్వహిస్తూ, ప్రజలను మోసం చేసిన దోషులపై చర్యలు తీసుకోవడంలో ఎంతమాత్రమూ వెనకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన డిపాజిటర్ల పరిరక్షణ చట్టానికి సవరణలు చేయనున్నామని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని వివరించారు. తాము చేసిన సవరణలకు క్యాబినెట్ ఆమోదం లభించిందని తెలియజేశారు. ఈ సవరణలు అమలైతే, ఆర్థిక సంస్థల్లో ప్రజలు పెట్టిన పెట్టుబడులకు గ్యారంటీ లభిస్తుందని, నిర్మాణ రంగంలో జరుగుతున్న మోసాల నియంత్రణకూ అవకాశం ఉంటుందని వివరించారు. అగ్రిగోల్డ్ మోసాలపై విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే విషయమై ఆలోచిస్తున్నామని చినరాజప్ప తెలిపారు.