: ప్రశ్నోత్తరాలు వద్దనడానికి మీరెవరు?: జగన్ పై యనమల నిప్పులు


ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, ప్రత్యేక హోదాపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేసిన వైకాపా నేత, విపక్ష నాయకుడు వైఎస్ జగన్ పై శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. ప్రశ్నోత్తరాలు వద్దనడానికి మీరెవరు? అని ఆయన ప్రశ్నించారు. తనపై ఉన్న కేసుల నుంచి బయట పడేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న దోషులు తమకు చెప్పక్కర్లేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా కన్నా తామే ఎక్కువగా కష్టపడుతున్నామని తెలిపారు. అంతకుముందు, హోదాపై స్టేట్ మెంటును చంద్రబాబు పూర్తి చేయాలని జగన్ డిమాండ్ చేశారు. అతిముఖ్యమైన హోదా కన్నా మరే ఇతర అంశాలకూ ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదని అన్నారు. అసెంబ్లీ 15 రోజుల పాటు పొడిగిస్తామని చెప్పే పక్షంలో, ప్రశ్నోత్తరాలకు వెళ్దామని, లేకుంటే ప్రత్యేక హోదాపై చర్చను చేపట్టాలని కోరారు. ఈ దశలో కల్పించుకున్న స్పీకర్ కోడెల, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. బీఏసీలో మాట్లాడుకుని అసెంబ్లీ పొడిగింపుపై నిర్ణయం తీసుకుందామని తెలిపారు. మొత్తానికి నేడు కూడా సభ ప్రారంభమైనప్పటి నుంచి అధికార, విపక్షాల వాదోపవాదాల మధ్యే సమావేశం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News