: పెరూలో భారీ దోపిడీ... 123 కిలోల బంగారం, రూ.13.3 కోట్ల నగదు అపహరణ
కిలోల కొద్దీ బంగారం, గుట్టలుగా కరెన్సీ నోట్లు... కార్లలో సురక్షితంగా ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చిన అధికారులు వాటిని మరో చోటికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపుంటే బంగారంతో పాటు డబ్బు మూటలు విమానంలోకి ఎక్కేసేవే. అయితే దీనిపై ముందుగానే పక్కా సమాచారం అందుకున్న దోపిడీ దొంగలు సినీ ఫక్కీలో మెరుపు దాడి చేశారు. విమానాశ్రయంలోకి చొరబడి పోలీసులు కళ్లుమూసి తెరిచేలోగానే బంగారం, డబ్బును ఎత్తకెళ్లారు. ఊహించని పరిణామంతో క్షణాల్లో తేరుకున్న పోలీసులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సగం మంది దొంగలు పట్టుబడినా, కేవలం 30 కిలోల బంగారాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. మిగతా బంగారం, డబ్బుతో మరో సగం మంది దొంగలు ఉడాయించారు. అచ్చం సినిమా ఫీట్ ను తలపించే రీతిలో జరిగిన ఈ చోరీ పెరూ రాజధాని లిమాలో జరిగింది. బంగారం, డబ్బును ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చిన ఆ దేశ అధికారులు వాటిని తరలించేందుకు చిన్న విమానాన్ని కూడా సిద్ధం చేశారు. ఇక లోడింగే తరువాయి అన్న సమయంలో 12 మంది దొంగలు మెరుపు దాడి చేశారు. తుపాకులు చేతబట్టి ఎయిర్ పోర్టు రన్ వే పైకి దూసుకొచ్చిన దొంగలు అధికారుపైకే కాక విమానంపైకీ కాల్పులు జరిపారు. అనంతరం భాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించారు. వచ్చిన దారిలోనే వారు బంగారం, డబ్బుతో దేశం దాటి బొలివియా వైపు దూసుకెళ్లారు. తేరుకున్న పెరూ పోలీసులు వారిని వెంటాడినా ఫలితం లేకపోయింది. డజను మంది దొంగల్లో ఆరుగురు పట్టుబడగా, 30 కిలోల బంగారం మాత్రమే దొరికింది.