: ప్రస్తుతం ‘ఓం’ అన్నా వివాదమే!... ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్య
ప్రస్తుతం దేశంలో ప్రతి అంశంపైన వివాదం రేగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ‘ఓం’ అన్నా అది వివాదానికి దారి తీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆలిండియా రేడియో రూపొందించిన ‘రామ్ చరిత్ మానస్’ సీడీల ఆవిష్కరణ సందర్భంగా ఆయన నిన్న న్యూఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రతి చిన్న విషయంపైనా సిద్ధాంత రాద్ధాంతాలు రేగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఆలపించిన ‘శ్రీవెంకటేశ్వర సుప్రభాతం’ దక్షిణాదిలో ఎంత ప్రజాదరణ పొందిందో, ఉత్తర భారతంలో రేడియోలో ప్రసారమయ్యే ‘రామ్ చరిత్ మానస్’కూ అంతే ఆదరణ లభిస్తోందని ప్రధాని అన్నారు.