: భార్యతో కలిసి అమెరికా వెళ్లిన ధోనీ... సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి కాస్తంత విశ్రాంతి లభించినట్టే ఉంది. టీమిండియా వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ, ప్రస్తుతం టెస్టు జట్టు శ్రీలంక పర్యటనలో బిజీబిజీగా ఉండగా, అతడు మాత్రం భార్యతో కలిసి అమెరికా వెళ్లాడు. న్యూజెర్సీలోని టామ్స్ రివర్ లో ప్రవాస భారతీయులు నిర్మిస్తున్న సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించాడు. ఇంకా నిర్మాణం జరుగుతున్న సదరు ఆలయానికి భార్యతో కలసి వెళ్లిన ధోని ప్రత్యేక పూజలు చేశాడు. ఈ సందర్భంగా అతడు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడాడు. అమెరికా సంస్కృతిని అలవరచుకుంటూనే భారతీయ మూలాలను మరకవపోవడంపై ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియా జట్టు సంధి దశలో కొనసాగుతోందని, దీంతో జట్టుకు ప్రవాస భారతీయులు మద్దతుగా నిలవాలని అతడు కోరాడు. ‘‘మాది మంచి టీం. ప్రస్తుతం జట్టులో ఎన్నో మార్పులు చోెటుచేసుకున్నాయి. కానీ, మెరుగైన ప్రదర్శనను కనబరుస్తూనే ఉన్నాం’’ అని అతడు పేర్కొన్నాడు. ఎప్పుడు అమెరికా వచ్చినా, వ్యక్తిగత పర్యటనలకు మాత్రమే పరిమితమయ్యేవాడినని, అయితే ఈ దఫా ఇక్కడి ప్రజలతో మాట్లాడటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అతడు పేర్కొన్నాడు.