: ఈ సారి పైచేయి ఎవరిది?... సైనా? సింధు?
గతేడాది ఇండియన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ ఫైనల్ లో భారత బ్యాడ్మింటన్ మహిళా అగ్ర క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సింధుపై సైనా విజయం సాధించింది. వీరిద్దరూ మరోసారి తలపడే సన్నివేశం భారత అభిమానులను అలరించనుంది. మహిళా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో రజత పతక విజేత సైనా నెహ్వాల్ ను జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో పీవీ సింధు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. తొలి రౌండ్ లో విదేశీ క్రీడాకారిణులతో తలపడే ఈ భారత అగ్ర క్రీడాకారిణులు రెండో రౌండ్ చేరుకుంటే ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. దీంతో ఈ పోరాటాన్ని క్రీడా పండితులు వీరి వ్యక్తిగత పోరుగా కంటే కోచ్ ల మధ్య పోరుగా అభివర్ణిస్తున్నారు. పుల్లెల గోపీచంద్ ను కాదని సైనా బెంగళూరు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. సింధు మాత్రం గోపీచంద్ ఆధ్వర్యంలోనే శిక్షణ పొందుతోంది. దీంతో వీరిద్దరి పోరుపై సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. కాగా, సింధు కంటే సైనా సీనియర్ కావడంతో అనుభవం ఆమెకు లాభించే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి ఎవరు గెలిచినా ఆసక్తికర పోరు కొనసాగే అవకాశం ఉంది. కాగా, వచ్చేవారం జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రారంభం కానుంది.