: పాక్ కుటిల ప్రణాళిక, ఉగ్రవాదుల చేతుల్లోకి యుద్ధ విమానాలు, ఇండియాపై 26/11 తరహా దాడులకు ప్లాన్!
భారత్ పై దాడులు జరిపేందుకు పాకిస్థాన్ వేస్తున్న కుతంత్రాలపై నిఘా వర్గాలకు అందుతున్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అందుతున్న వివరాల ప్రకారం, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులకు యుద్ధ విమానాలు ఇచ్చి, అల్ ఖైదా అమెరికాపై జరిపిన 26/11 తరహా దాడులు చేయాలని కుట్ర పన్నుతోంది. లష్కరే ఉగ్రవాదులకు పాకిస్థాన్ నౌకాదళం, ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్) సాయపడుతున్నాయని, పలువురికి విమానాలు నడపడంలో శిక్షణ ఇస్తున్నాయని, దీనికోసం కరాచీ పోర్టు విమానాశ్రయాన్ని వాడుతున్నాయని నిఘా వర్గాలు పసిగట్టాయి. కాగా, "ఇండియాను భారీగా నష్టపరిచి, దశాబ్దాల తరబడి గుర్తుండేంతటి విధ్వంసం చేయగల శక్తి పాకిస్థాన్ వద్ద ఉంది" అని ఆ దేశ రక్షణ మంత్రి ఖావాజా మహమ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యానించిన 24 గంటల తరువాత ఈ వార్తలు వెలువడటం గమనార్హం. నిషేధిత ఉగ్ర సంస్థలకు ఊతమిస్తూ, భారత్ పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తుండటంతో, దీన్ని అడ్డుకునేందుకు అత్యాధునిక రాడార్లను, పరిస్థితులను ఎదుర్కోవడానికి విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థలను నిరంతరం సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.