: శ్రీరాంసేన చీఫ్ తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
శ్రీరాంసేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గోవా రాష్ట్రంలోకి తన ప్రవేశాన్ని నిషేధిస్తూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు సుప్రీం తిరస్కరించింది. అంతేకాదు, చట్టాలను కాదని ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు? అని ప్రశ్నిస్తూ ముతాలిక్ తీరును కోర్టు తప్పుబట్టింది. ఇటువంటి ఘటనలకు మరలా పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించింది. జూన్ 2న గోవా వెళ్లొద్దంటూ ముంబై కోర్టు సేన చీఫ్ ను ఆదేశించింది. ఆ ఆదేశాలను కొట్టివేయాలంటూ ముతాలిక్ ఆగస్టులో గోవా మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా అనుమతివ్వకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాంతో ఇక గోవాలో ముతాలిక్ ప్రవేశించే దారులు పూర్తిగా మూసుకుపోయాయని చెప్పవచ్చు. పర్యాటక స్థలాలు, పార్కులు వంటి పలు ప్రాంతాల్లో ప్రేమికులపై శ్రీరాంసేన ప్రతినిధులు దాడులకు పాల్పడుతుంటారు.