: రూ. 7.17 లక్షల కోట్ల ఆదాయంతో, 6 లక్షల మందికి ఉద్యోగాలిచ్చిన భారత కంపెనీ ఇదే!
ఆ సంస్థ నిర్వహిస్తున్న కంపెనీల్లో 6 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. ఉప్పు నుంచి వాహనాల తయారీ వరకూ, సెల్ ఫోన్ల నుంచి ఐటీ కమ్యూనికేషన్ల వరకూ విస్తరించిన ఆ గ్రూప్ ఏంటో తెలుసా? టాటా గ్రూప్! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ సంస్థల ఆదాయం రూ. 7,17,948 కోట్లను తాకింది. గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగిన ఆదాయం 108.78 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారత గ్రూప్ టాటాలదే. 1868లో జమ్షట్ జీ టాటా నెకొల్పిన సంస్థ ప్రస్తుతం 100కు పైగా కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. టాటా గ్రూప్ ఆదాయంలో 70 శాతం విదేశాల నుంచే వస్తోంది. ఆదాయం పెరిగినప్పటికీ, ఆదాయ వృద్ధి మాత్రం తగ్గినప్పటికీ, భవిష్యత్తులో పుంజుకుంటామని టాటా గ్రూప్ చెబుతోంది. మార్చి 2015 నాటికి సంస్థలో 6,11,796 మంది పనిచేస్తున్నారని, వీరిలో 3.5 లక్షల మంది ఐటీ, కమ్యూనికేషన్స్ సంస్థల్లో పనిచేస్తుండగా, ఇంజనీరింగ్ విభాగంలో 93 వేలు, మెటీరియల్స్ వ్యాపారంలో 80 వేలు, సేవా రంగంలో 44 వేల మంది పనిచేస్తున్నారని సంస్థ తెలిపింది. కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్ లో 22 వేల మంది, ఇంధన రంగంలో 9 వేల మంది విధులు నిర్వహిస్తుండగా, 2013-14లో ఉద్యోగుల సంఖ్య 5,81,473తో పోలిస్తే కొత్తగా 6.8 శాతం మందిని విధుల్లోకి తీసుకున్నామని పేర్కొంది. టాటా గ్రూప్ నిర్వహిస్తున్న కంపెనీల్లో టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్, టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బీవరేజస్, టాటా టెలీ సర్వీసెస్, టైటాన్, టాటా కమ్యూనికేషన్స్, ఇండియన్ హోటల్స్ తదితరాలు ప్రధానమైనవి.