: భారత ప్రభుత్వాన్నే భయపెట్టిన 22 ఏళ్ల యువకుడు: ఫారిన్ మీడియా
6.3 కోట్ల మంది ప్రజలున్న గుజరాత్ లో దాదాపు కోటి మంది పటేల్ వర్గీయులే. వారందరినీ ఒక బాటలోకి తీసుకురావడం ద్వారా 22 ఏళ్ల యువ నేత హార్దిక్ పటేల్ కేంద్రంలోని మోదీ సర్కారును భయపెట్టాడు. ఎంతగా అంటే, గొడవలు విస్తరిస్తాయేమో... అంటూ, మొబైల్ సేవలను నిషేధించేంతగా! ఈ మాటలన్నది ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బ్రిటన్ వార్తా సంస్థ 'బీబీసీ'. ఒక్క బీబీసీనే కాదు, న్యూయార్క్ టైమ్స్, ఫ్రాన్స్ 24, డెయిలీ మెయిల్ యూకే, పీబీఎస్ వంటి పత్రికలు, వార్తా సంస్థలు హార్దిక్ చేపట్టిన ర్యాలీ, ప్రసంగం, ఆ తరువాత నెలకొన్న పరిస్థితులపై సవివరమైన కథనాలు ప్రచురించాయి. ఇండియాలో ఓ కొత్త నేత పుట్టుకొచ్చాడని, కోటి మంది ప్రజలను ముందుండి నడిపిస్తున్నాడని, గుజరాత్ స్ఫూర్తిగా ఇతర రాష్ట్రాల్లో సైతం ఇదే తరహా ఉద్యమాలు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించాయి. మోదీ ఇలాకాలో ఇటువంటి గొడవలు జరగడం, 8 మంది చనిపోవడం, దీనిపై ఆయనే స్వయంగా కల్పించుకుని గాంధీ పుట్టిన దేశంలో ఈ తరహా హింస సరికాదని వ్యాఖ్యానించడాన్ని ప్రచురించాయి. ఆయనలో కొత్త ఆందోళన మొదలై ఉండవచ్చని అభిప్రాయపడ్డాయి. భారత ప్రభుత్వం పటేళ్ల నిరసన తరువాత కొంత భయపడినట్టు కనిపిస్తోందని పేర్కొన్నాయి.