: కలాం కోరిక మేరకే సెలవు ప్రకటించలేదు... మాజీ రాష్ట్రపతి మృతికి అసెంబ్లీలో చంద్రబాబు సంతాపం
తన మృతికి సంతాపంగా సెలవు ప్రకటించొద్దన్న భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సూచనను అమలు చేసినట్లు ఏపీ సీఎం నారా చంద్రబాఃబునాయుడు స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కలాం మృతికి సంతాపం తెలుపుతూ చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి పదవికి కలాం వన్నె తెచ్చారన్నారు. దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కలాం కృషి చేశారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కూడా కలాం పలు చర్యలు చేపట్టారన్నారు. విజన్ 20 డాక్యుమెంట్ రూపకల్పనలో తన సలహాలను కూడా కలాం స్వీకరించారని ఆయన పేర్కొన్నారు. కలాం ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను చనిపోతే సెలవు ప్రకటించొద్దన్న కలాం సూచన మేరకే ఆయన మృతి సందర్భంగా రాష్ట్రంలో సెలవు ప్రకటించలేదని చంద్రబాబు తెలిపారు.