: ప్రారంభమైన ఏసీ అసెంబ్లీ సమావేశాలు... మైక్ కోసం పట్టుబడుతున్న జగన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. బీఏసీ సమావేశం ముగిసిన వెంటనే ప్రారంభమైన సమావేశానికి అధికార, విపక్షాలకు చెందిన దాదాపు అందరు సభ్యులూ హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ కోసం వైసీపీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. ఈ అంశంపై ఇప్పటికే అధికార పక్షం చర్చకు సిద్ధమని ప్రకటించడంతో పాటు నేడే చర్చ జరగనున్న నేపథ్యంలో విపక్ష తీర్మానం అవసరం లేదని కోడెల స్పష్టీకరించారు. వాయిదా తీర్మానం తిరస్కరణపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ అంశంపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ ఆయనకు మైకిచ్చారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేని టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. దీనిపై సుదీర్ఘ ప్రసంగం చేసేందుకు జగన్ యత్నించగా, స్పీకర్ ఆయన మైకును కట్ చేశారు. ప్రస్తుతం సభలో అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.