: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార, విపక్షాలు
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గత అసెంబ్లీ సమావేశాలు విపక్షం ఆందోళన, అధికార పక్షం ప్రతిదాడి నేపథ్యంలో దాదాపుగా అన్ని రోజులూ సమావేశాలు దుర్లభమైన సంగతి తెలిసిందే. నాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అటు అధికార పక్షంతో పాటు, ఇటు విపక్షం కూడా తమవైన ప్రత్యేక వ్యూహాలతో సమావేశాలకు సన్నద్ధమయ్యాయి. ప్రతిపక్ష సభ్యులు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని తన పార్టీ సభ్యులకు టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేయగా, ప్రజా సమస్యలపై చర్చే పరమావధిగా చర్చకు పట్టుబట్టాలని, సొంత ఎజెండాలను పక్కనబెట్టాల్సిందేనని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి మరికాసేపట్లో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సభ నిర్వహణకు సంబంధించి ఇరు పార్టీలకు స్పీకర్ కోడెల శివప్రసాద్ దిశానిర్దేశం చేయనున్నారు.