: ఎమ్మెల్యేలకు ఎదురుదాడి మంత్రం ఉపదేశించిన చంద్రబాబు!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం చంద్రబాబు నివాసంలో స్ట్రాటజీ కమిటీ సమావేశమైంది. ప్రతిపక్షాన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఎదురుదాడి తప్పదని చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రత్యేక హోదా, రాజధాని భూసేకరణ, ఓటుకు నోటు, గోదావరి పుష్కరాల విషాద ఘటన తదితర అంశాలపై దీటుగా బదులివ్వాలని ఎమ్మెల్యేలకు బాబు సూచించారట. సభలో కొన్ని కీలక అంశాలపై స్పందించేలా కొందరు ఎమ్మెల్యేలకు సీఎం ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. కాగా, టీడీపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... సభ హుందాగా జరిగేందుకు వైసీపీ సహకరించాలని కోరారు. ప్రత్యేక హోదాపై చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీతో ఏం అంశంపై అయినా తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తే సమస్యలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సభ జరగనివ్వకపోతే పూర్తి బాధ్యత జగన్ దేనని స్పష్టం చేశారు. తన తప్పులు బయటికొస్తాయనే జగన్ సభను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుపై బురద చల్లటం తప్ప జగన్ కు ప్రజాసమస్యలు పట్టవని అన్నారు. జగన్ కు ప్రజాసమస్యలు ముఖ్యమా? లేక, వైఎస్ ఫొటో ముఖ్యమా? అని ప్రశ్నించారు. ఫొటో కోసం సభను అడ్డుకుంటే ప్రజలే జగన్ కు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.