: కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైంది?: బీహార్ లో సోనియా సమర శంఖం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన స్వాభిమాన్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు. దేశంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్డీయే అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కారని ఆమె విమర్శించారు. దేశంలో యువతకు భరోసా లభించడం లేదని, వారిప్పుడు ఉపాధి కరవై రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మహా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో బీహార్ సీఎం నితీశ్ కుమార్, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.