: ఈసారి దత్తన్న వంతు... లిఫ్టులో ఇరుక్కుపోయిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి


బీజేపీ నేతలను ‘లిఫ్ట్’ ప్రమాదాలు చుట్టుముట్టినట్టున్నాయి. మొన్నటికి మొన్న బీహార్ పర్యటనకు వెళ్లిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాట్నాలోని ఓ లిఫ్టులో ఇరుక్కుపోయారు. స్థానిక పోలీసులు, సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది లిఫ్ట్ డోర్లను బద్దలు కొడితే కాని ఆయన బయటపడలేకపోయారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా నేటి ఉదయం హైదరాబాదులో లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరంలోని కాచిగూడకు వెళ్లిన దత్తన్న, వేదిక వద్దకు చేరుకునేందుకు భవనంలోని లిఫ్ట్ ఎక్కారు. దత్తన్న లిఫ్ట్ ఎక్కిన తర్వాత కొద్ది దూరం కదిలిన లిఫ్ట్ రెండు అంతస్తుల మధ్య నిలిచిపోయింది. దీంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలు కాస్తంత త్వరగానే ఫలించి లిఫ్ట్ తలుపులు తెరచుకున్నాయి. దత్తన్న సురక్షితంగా బయటపడ్డారు.

  • Loading...

More Telugu News