: ఇంటర్ లో తెలుగు భాషను తప్పనిసరి చేస్తాం: చంద్రబాబు
ఇంటర్ మీడియట్ విద్యలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయ వారసత్వాలను కాపాడుకోవడంలో భాష కీలకమని ఆయన చెప్పారు. మాతృభాషను కాపాడుకుంటే ఉనికిని కాపాడుకున్నట్టేనని ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీల్లో ఇతర భాషలను సెకెండ్ లాంగ్వేజ్ గా ఎంచుకుంటున్నారని, ఇకపై తెలుగును మాత్రమే ఎంచుకునేలా నిబంధనలు పెడతామని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు కీలకమైన స్థానాల్లో ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.