: ఐదుగురిని కనండి... రూ.2 లక్షలు తీసుకోండి ... హిందువుల సంఖ్య పెంపుకు శివసేన ప్రయత్నం
దేశంలో కులాల వారీగా ఇటీవల ప్రకటించిన జాబితాలో హిందువుల సంఖ్య తగ్గడంపై శివసేన ఆగ్రా యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ సంఖ్య పెంచేందుకు తమవంతు ప్రయత్నం ప్రారంభించింది. ఐదుగురు పిల్లలున్న ప్రతి ఇంటికీ రూ.2 లక్షల బహుమతి ఇస్తామని శివసేన ప్రకటించింది. హిందువుల సంఖ్య తగ్గినందువల్లే ఈ బహుమతిని ప్ర్రవేశపెట్టామని శివసేన జిల్లా చీఫ్ వీను లావానియా చెప్పారు. అంటే 2010-15 మధ్య ఐదుగురు పిల్లలు కలిగిన కుటుంబాలకు, ఇప్పుడు కనబోయే ప్రతి కుటుంబానికి రెండు లక్షల నగదు బహుమతి అందజేస్తారు. బహుమతి కోసం సదరు తల్లిదండ్రులు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పొందిన జనన ధ్రువీకరణ పత్రం పొందుపర్చాలని తెలిపారు. అయితే ఇదే సమయంలో ముస్లిం జనాభా పెరుగుతుండటంపై కూడా శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. వారు ఏకరూప పౌర కోడ్ కు కట్టుబడాలని, బహుభార్యాత్వం వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.