: పది రాఖీలు కొనండీ, కేజీ ఉల్లిపాయలు తీసుకెళ్లిండి...సేల్స్ అదుర్స్!
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో రాఖీ పండగను వినియోగదారుల వద్దకు వ్యాపారులు వినూత్నంగా తీసుకెళ్లారు. రక్షాబంధన్ కు హిందూ సంప్రదాయంలో విశేషమైన ఆదరణ ఉంది. భారతదేశంలో కులమతాలకు అతీతంగా రక్షాబంధన్ నిర్వహించుకుంటారు. దీనిని మంచి అవకాశంగా మలచుకున్న వ్యాపారులు మహిళలను ఆకట్టుకునేందుకు పది రాఖీలు కొంటే, కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అంటూ ప్రకటన ఇచ్చారు. అంతే, వ్యాపారం ఊపందుకుంది. అలా ప్రకటించిన షాపుల ముందు మహిళలు క్యూకట్టారు. రాఖీ లభించడంతో పాటు, ఇంటి అవసరం కూడా తీరే అవకాశం దక్కడంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు రాఖీలు కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారుల పంట పండింది. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో రాఖీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలువురు యువతులు సైనికులు, పోలీసులకు రాఖీలు కట్టి వారిపై ఉన్న అభిమానం చాటుకున్నారు.